అది మధ్యప్రదేశ్... దేవాస్‌లోని... గునేరా గునేరీ నది. మరీ పెద్దగా ఉండదు కాలువలాగా ప్రవహించే నది. వర్షాకాలం వస్తే చాలు ఆ నదిలో నీరు పెరుగుతాయి. ఇక అందులో దిగితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. నదికి ఇటువైపు ఊళ్లు, అటువైపు పొలాలు ఉన్నాయి. రోజూ నది దాటకపోతే... పనులు జరగవు. కాబట్టి... ఆ రైతులకు అది నిత్యం వేధించే సమస్యగా మారింది. కొన్ని డజన్ల కొద్దీ గ్రామాల్లో వారికి ఈ సమస్య ఉంది. తమకు ఈ గతి ఎందుకు పట్టింది దేవుడా అని ఇదివరకు వారు ఆవేదన చెందేవారు.
ఈ కాలువపై వంతెనను నిర్మించమని ఏళ్లుగా రైతులు కోరుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అధికారులు, నేతలు కూడా ఇటు రావడం మానేశారు. దాంతో గ్రామంలో యువకులే దాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు రైతులు తేలిగ్గా రోజూ పొలాలకు వెళ్లగలుగుతున్నారు. మిగతా వారు కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రయోజనం పొందుతున్నారు. మా ప్రాణాలు పణంగా పెడుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు ఆవేదన చెందుతున్నారు.