మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కు చెందిన ఆనంద్ ప్రకాశ్ చోక్సీ కుటుంబానిది ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల రేంజ్. అవును, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను పోత పోసినట్లుగా కట్టిన ఇంట్లో ఉండటమంటే ఆమాత్రం చెప్పుకోవాల్సిందే. తాజ్ మహల్ ఇంటిని ఆనంద్ తన భార్య మంజుషాకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెబుతున్నాడు. అదే సమయంలో చారిత్రక విశేషాన్ని కూడా పంచుకున్నాడు..
మొఘల్ చక్రవర్తి షాజహాన్.. చనిపోయిన తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా తాజ్ మహల్ నిర్మించడం తెలిసిందే. నిజానికి తాజ్ మహల్ ఆగ్రాలో యమున నది ఒడ్డున ఇప్పుడున్న చోట నిర్మించాలని అనుకోలేదు. ముంతాజ్ తన 38వ ఏట 14వ సంతానానికి జన్మనిస్తూ రక్తస్త్రావం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయిన ఊరు బుర్హాన్పూర్.
ముంతాజ్ ప్రాణాలు కోల్పోయిన బుర్హాన్పూర్ లో తపతీ నది ఒడ్డునే తాజ్ మహల్ నిర్మించాలని షాజహాన్ భావించాడు. కానీ వివిధ కారణాల వల్ల చివరికి తాజ్ మహల్ ఆగ్రాలో యమునా నది ఒడ్డున నిర్మితమైంది. నాడు షాజహాన్ కలగా మిగిలిపోయిన పనిని నేడు ఆనంద్ ప్రకాశ్ మరో రూపంలో సిద్దింపజేశాడు. తాజ్ మహల్ ను పోలిన ఇంటిని నిర్మించిన తర్వాత స్థానికులు అతణ్ని‘బుర్హాన్పూర్ కా షాజహాన్’ అంటూ కీర్తిస్తున్నారు.
అచ్చం తాజ్ మహల్ ను పోలిన ఈ ఇంటిని కట్టడానికి మూడేళ్లు పట్టింది. ఆనంద్ తన ఆర్కిటెక్ట్ లకు ఈ ఐడియా చెప్పాక, వారంతా దశలవారీగా నిజమైన తాజ్ మహల్ సదర్శనకు వస్తూ పోతూ మొత్తానికి 3డీ విధానంలో నిర్మాణాన్ని చేపట్టారు. 80 అడుగుల ఎత్తులో తాజ్ మహల్ ఇంటిని నిర్మించాలని ఆనంద్ అనుకున్నా, అందుకు స్థానిక మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎత్తు తగ్గించేశారు.
ఆనంద్ కుటుంబీకులు నివసించే తాజ్ మహల్ ఇల్లు.. మొత్తం 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రధానమైన తాజ్మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉన్నాయి. ఇంటి లోపలి డిజైన్లను తీర్చిదిద్దేందుకు బెంగాల్, ఇండోర్ నుంచి కళాకారులను రప్పించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ‘మక్రానా’తో ఫ్లోరింగ్ చేయించారు.