మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు అనేక మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. కొన్నిసార్లు ఇలాంటి దుర్ఘటనల్లో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. గుజరాత్.. వల్సాద్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడు అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన లైఫ్ సేవింగ్ విండో సిస్టమ్.. అగ్ని ప్రమాదాల్లో ప్రాణనష్టాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ లైఫ్ సేవింగ్ విండో.. భవిష్యత్తులో ఎత్తైన భవనాలలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌తో పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పని ఇప్పుడు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి గణిత సైన్స్ ఫెయిర్‌లో ఎంపికై.. తాజాగా జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో పాఠశాలతో పాటు వల్సాద్ మొత్తం ఆసక్తిగా ఉంది.
వల్సాద్ జిల్లా.. పార్డి తాలూకా.. చిన్న ఖెర్లావ్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో చదువుతున్న జయన్స్ మనీష్భాయ్ పటేల్ అనే విద్యార్థి, పాఠశాల గణిత ఉపాధ్యాయుడు చేతన్ పటేల్ ఒక అపూర్వమైన కాన్సెప్ట్‌ను సృష్టించారు. రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహించిన గణితశాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలలో ఈ పనిని ప్రదర్శించారు. ఈ పని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది.