జైల్లోంచే బెదిరింపు రాకెట్ నడపడం.. అలా చేయనిచ్చినందుకు, తనకు సర్వసౌకర్యాలూ కల్పించినందుకు తిహార్ జైలు అధికారులకు నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇవ్వడం.. నచ్చిన బాలీవుడ్ హీరోయిన్కల్లా రూ.లక్షలు, కోట్లు విలువ చేసే ఖరీదైన కానుకలు పంపడం.. అన్నీ కలిసొస్తే వారితో ఎంజాయ్ చేయడం ..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేటుగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవనశైలి ఇది.
ఈడీ ఉచ్చుకు చిక్కి 2017 నుంచి తిహార్ జైల్లో ఉన్న సుకేశ్‌ను కలవడానికి కనీసం 12 మంది దాకా మోడళ్లు, నటీమణులు వచ్చారట. జైలు అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం వల్ల.. సుకేశ్‌ను కలవడానికి అతడి భార్య లీనా మారియా పాల్ ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లేందుకు వారు అనుమతిచ్చేవారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
జైల్లో అతడి 'ఆఫీసు' టీవీ, ఫ్రిజ్, సోఫా వంటివాటితో అత్యంత విలాసవంతంగా ఉండేదని మారియాపాల్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. జైల్లో అతడు సిబ్బందికి 'చికెన్ పార్టీ'లు ఇచ్చేవాడట. జైల్లో అతణ్ని కలవడానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి ('బాహుబలి' సినిమాలో 'మనోహరి' పాటలో నర్తించింది) సహా పలువురు సూపర్ మోడళ్లు, నటీమణులువచ్చేవారని అధికారులు చెబుతున్నారు.
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలతో ప్రపంచానికి పరిచయమైన సుకేశ్ మొదట్నుంచీ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఒక సెల్‌ఫోన్, గొంతు మార్చే యాప్ సాయంతో తాను కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర్నుంచి కాల్ చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ అధికారినని చెప్పుకొంటూ బిగ్షాట్ల దగ్గర్నుంచీ భారీగా దండుకున్న డబ్బులను అతడు తనకు నచ్చిన హీరోయిన్/మోడల్ కోసం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడని ఈడీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేవలం నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు అతడు అత్యంత ఖరీదైన కంపెనీలకు చెందిన మూడు డిజైనర్ బ్యాగులు, జిమ్ దుస్తులు, పాదరక్షలు, రెండు జతల వజ్రాల కర్ణాభరణాలు, బ్రేస్లెట్లు, ఒక కారు, గుర్రం ఇచ్చాడు. వీటి గురించి ఆమే స్వయంగా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాదు.. ఆమె కోసం అతడు ప్రైవేటు విమానాల్లో ప్రత్యేక ట్రిప్పులు, ఖరీదైన హోటల్ ఆతిథ్యాలు ఏర్పాటు చేసేవాడట సుకేశ్ చంద్రశేఖర్.