International Tiger Day 2020 : పిలలలు జూకి వెళ్లినప్పుడు... ఏ జంతువును చూసినా ఆనందపడతారు. పులిని చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఆ గంభీరమైన చూపులు, నల్లటి చారలు, రాచ ఠీవీ ఒలకబోస్తూ... అటూ ఇటూ పులి తిరుగుతుంటే... అందరూ... దాన్ని చూసి... ఎలా ఉందో చూడు అనుకుంటుంటే... అది చూసి పిల్లలు థ్రిల్ ఫీలవుతారు. అంతరించే జంతువుల జాబితాలో ఉన్న పులులను కాపాడే బాధ్యత మనందరిదీ. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (WWF) ప్రకారం... ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నది 3900 పులులే. వాటిలో 70 శాతం మన ఇండియాలోనే ఉన్నాయి. మంచి విషయమేంటంటే... ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, రష్యాలో... పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినప్పటికీ వాటి సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి.
భారతదేశ జాతీయ జంతువైన పులి... రాచఠీవికి పెట్టింది పేరు. పులి ఎప్పుడూ శత్రువు ముందు తల వంచదు. దాని అడుగులు ముందుకే పడతాయి తప్ప... వెనక్కి వెళ్లవు. ప్రాణాలను పులి లెక్కచెయ్యదు. అందుకే... అడవుల్లో పులి స్థానం సుస్థిరం. పులులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా... పులులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
పులులు 20 ఏళ్ల దాకా బతుకుతాయి. షాకింగ్ విషయమేంటంటే... పులి పిల్లలు పుట్టినప్పుడు వాటికి కళ్లు కనపడవు. తమ తల్లు నుంచి వచ్చే వాసనను బట్టీ తల్లిని ఫాలో అవుతాయి. పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయి. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయి. WWF ప్రకారం... చాలా పులులు పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నాయి.