ప్రేమలో విఫలమైనా, విడాకులు తీసుకున్నా, ఉద్యోగం పోయినా, వర్క్ ఎక్కువైనా... జీవితం టెన్షన్ మయం అయిపోతుంది. దేనిపైనా ఆసక్తి ఉండదు. ఏదీ చెయ్యాలనిపించదు. చిరాకులూ, చికాకులూ ఎక్కువవుతాయి. కోపం పెరుగుతుంది. ఇవన్నీ క్రమంగా మెదడు నరాలపై ప్రభావం చూపిస్తాయి. మెల్లమెల్లగా మెమరీ పవర్ తగ్గిపోతుంది. అది కాస్తా అల్జీమర్స్ వ్యాధి వచ్చేందుకు కారణమవుతుంది. మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా ఇలా జరుగుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
స్ట్రెస్ నుంచీ మనం తప్పించుకోలేం. ఈ రోజులే అలాంటివి. ఐతే... ఒత్తిడి ఉంది కదా అని దానికి లొంగిపోకూడదు. దాని అంతు చూడాలి. ధైర్యంగా పోరాడాలి. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ప్రయత్నించాలి. ఈ ఒత్తిళ్లు నన్ను ఏమీ చెయ్యలేవ్... అని మనసులో బలంగా అనుకోవాలి. అలా మన మైండ్‌ని మనమే స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలా చేసుకోవాలి అని సూచించారు అమెరికా జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సింథియా మన్రో.
మన్రో టీమ్ దాదాపు 900 మంది డేటాను సేకరించి పరిశీలించింది. ఆ 900 మందిలో 63 శాతం మంది మహిళలే. మొత్తం అందరి సగటు వయసు 47 సంవత్సరాలు. మామూలు స్ట్రెస్ విషయంలో మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఒత్తిడి తగ్గిపోగానే ఆ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఐతే... అదే పనిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటే... హార్మోన్ల స్థాయి ఎక్కువైపోతుంది. పరిస్థితులు అదుపు తప్పుతాయి.