అక్రమ మైనింగ్, అవినీతి కేసుల వల్ల సొంతూరు బళ్లారికి దూరమైన గాలి జనార్ధన్ రెడ్డి ఆమధ్య కూతురు పెళ్లి కోసం ఏకంగా బళ్లాలి ఊరి సెట్టింగ్ నే బెంగళూరులో వేయించి అంగరంగవైభవంగా జరిపించారు. ఇటీవలే కొడుకును కూడా భారీ బడ్జెట్ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు. తాజాగా తన భార్య అరుణ లక్షితో అరుదైన ఫొటో షూట్ చేయించి అందరినీ అబ్బురపర్చారు.
పూర్వకాలంలో(అంటే మరీ పూర్వం కాదు, బ్రిటిష్ జమానాలో) మన దేశంలోని రాజులు, మహారాజులు తమ కుటుంబాల చిత్రాలను రాజా రవి వర్మతో గీయించుకుని ఆనందించేవారు. ఆ రోజుల్లో రవి వర్మను పిలవని రాజులు లేరంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రవి వర్మ లేరు. పైగా ఇది మెగా పిక్సల్ కెమెరాల జమానా. రవి వర్మతో బొమ్మ గీయించుకోలేకపోయినా.. ఆయన పెయింటింగ్స్ ను తలపిస్తూ భర్య అరుణ లక్ష్మితో ఫోటో షూట్ చేయించారు గాలి జరార్ధన్ రెడ్డి.
‘రవి వర్మ చేతిలో ప్రాణం పోసుకున్న.. సంప్రదాయ వస్త్రధారణలోని అందమైన స్త్రీల చిత్రాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ గొప్ప కళాకారుడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా నా భార్య అరుణ లక్ష్మి ఫొటోసెషన్ నిర్వహించింది. ఆ ఫొటోలే ఇవి. దేశ ప్రజలందరికీ రాజా రవి వర్మ జయంతి శుభాకాంక్షలు’అని గాలి జనార్ధన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు.
గాలి జనార్ధన్ రెడ్డి-అరుణ లక్ష్మీ దంపతులు తమ కూతరు బ్రాహ్మణికి 2016లో ఘనంగా పెళ్లి జరిపించారు. అప్పటికే అక్రమ మైనింగ్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పొందిన జనార్ధన్ రెడ్డి.. సొంతూరు బళ్లారికి వెళ్లడానికి వీల్లేదని కోర్టు నిర్దేశించడంతో బెంగళూరులోనే బళ్లారి సెట్ వేయించి అత్యంత వైభవంగా వివాహ వేడుక నిర్వహించడం దేశ చరిత్రలో ఒక రికార్డు. ఆ సందర్బంలో గాలి ఫ్యామిలీ ఒక పాటను కూడా రూపొందించి, నటించడం తెలిసిందే.
గాలి జనార్ధన్ రెడ్డి-అరుణ లక్ష్మీ దంపతుల కొడుకైన కిరీటి రెడ్డి ఇప్పుడొక భారీ బడ్జెట్ సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో కన్నడ-తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు 'బాహుబలి', 'పుష్ప' చిత్రాలకు పనిచేసిన స్పెషలిస్టులు తోడయ్యారు. సో, గాలి ఫ్యామిలీ వైభవం ఈసారి వెండితెరపై చూడబోతున్నామన్నమాట. ‘అట్లుంటది మరి గాలి ఫ్యామితోని’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.