ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పొంది, ఇండియాలో టాప్-3 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు బెంగాల్ కు చెందిన సబ్యసాచి ముఖర్జీ. ఆయన పేరునే బ్రాండ్ గా, దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో సబ్యసాచి ఔట్ లెట్స్ నెలకొల్పారు. ప్రతిసారి కొత్తదనంతో నిండిన ప్రకటనలు రూపొందించే సబ్యసాచి తాజాగా మంగళసూత్ర కాన్సెప్ట్ తో ఒక యాడ్ విడుదల చేసింది. అందులో అనూహ్య పోకడలు ఉంన్నాయంటూ పెద్ద దుమారం చెలరేగింది..
సబ్యసాచి మంగళసూత్ర యాడ్ లో మోడళ్లు లోదుస్తుల్లో అర్థనగ్నంగా కనిపిండంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందువులు పవిత్రంగా భావించే తాళిని ఎగతాళి చేశారంటూ సబ్యసాచిపై నెటిజన్లు మండిపడ్డారు. యాడ్ లో దుస్తులను మించి, తాళి ఎవరెవరు కొట్టుకోవచ్చనే అభివ్యక్తీకరణలు మరింత వివాదాస్పదం అయ్యాయి. ఆడ-మగ జంటలతోపాటు ఆడ-ఆడ, మగ-మగ జంటలు కూడా తాళిని ధరించినట్లు యాడ్ లో చూపించడంపై అతివాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలికిచిలికి గాలివానలా..
లోదుస్తుల్లో మంగళసూత్ర యాడ్ చేయడమేకాకుండా అందులో లెస్బియన్, గే సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నారంటూ సబ్యసాచిపై పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మరోఅడుగు ముందుకేసి సబ్యసాచికి అల్టిమేటం జారీ చేశారు. మంగళసూత్రం వాణిజ్యప్రకటనను 24 గంటల్లోగా వెనక్కి తీసుకోకపోతే పోలీసులతో బలప్రయోగానికి కూడా వెనుకాడబోనని మంత్రి మిశ్రా హెచ్చరించారు. దీంతో..
‘వారసత్వం, సంస్కృతిని డైనమిక్ సంభాషణగా మార్చే సందర్భంలో, మంగళసూత్ర ప్రచారం చేశాం. కాని ఈ ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మేం చాలా బాధపడ్డాం. సబ్యసాచి ప్రచార ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’ అంటూ డిజైనర్ సంస్థ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటన చేసింది. విచిత్రంగా ఈ వివరణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సబ్యసాచి మంగళసూత్ర యాడ్ కంటే ముందు ఫ్యాబ్ ఇండియా రూపొందించిన కార్వాచౌత్ ప్రకటనపైనా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీచేశారు. సాధారణంగా కార్వాచౌత్ పండుగనాడు భార్యభర్తలు జరిపే తంతును ఫ్యాబ్ ఇండియా యాడ్ లో ఇద్దరు మహిళల మధ్య చూపించారు. తద్వారా లెస్బియన్ కల్చర్ ను ప్రమోట్ చేస్తున్నారని, కేవలం హిందువుల పండుగలను అవమానించేందుకే ఇలాంటి యాడ్స్ వస్తున్నాయని మిశ్రా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ‘బైకాట్ ఫ్యాబ్ ఇండియా’ప్రచారం సైతం ఉధృతంగా సాగింది.
అప్పట్లో తనిష్క్ జువెలరీ, మొన్న ఫ్యాబ్ ఇండియా, ఇవాళ సబ్యసాచి.. ఇలా వాణిజ్య ప్రకటనలు వివాదాస్పదం అవుతుండటం, వాటిపై అతివాద గ్రూపులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, గొడవ ముదిరిన తర్వాతగానీ సదరు ప్రకటనలను ఆయా సంస్థలు ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. సబ్యసాచితో ఇలాంటి వివాదాలు ముగుస్తాయా? మరొకొన్ని పుట్టుకొస్తాయా? అనే చర్చ జరుగుతోంది..