వల్సాద్‌లోని డుంగ్రీ సమీపంలో జాతీయ రహదారిపై డుంగ్రీ వంతెన దిగుతుండగా, హైవేపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు బోల్తా పడటంతో కారు బయట ఉన్న హైవేపై విదేశీ మద్యం సీసాలు పడ్డాయి. హైవేపై మద్యం బాటిళ్లు పేరుకుపోవడంతో అటుగా వెళ్తున్న పాదచారులు, చుట్టుపక్కల వాసులు బహిరంగంగా మద్యం దోచుకున్నారు.
కారు ప్రమాదానికి గురై, గాయపడిన వ్యక్తులు జనం నంచి సహాయం పొందకుండానే పారిపోడానికి కారణం లేకపోలేదు. గుజరాత్ లో చాలా ఏళ్లుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతున్నది. మద్యం అక్రమ రవాణా కేసుల్లో కఠిన శిక్షలు పడిన ఉదంతాలూ ఉన్నాయి. అందుకే కారు బోల్తా పడిన తర్వాత గాయపడ్డ వ్యక్తులు తేలుకుట్టిన దొంగల్లా అక్కడి నుంచి జారుకున్నారు.
అయితే, కారు నంబర్, ఇతర ఆధారాలను బట్టి అది ఎవరిదో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ అక్రమ దందా జోరుగా సాగుతోన్న దరిమిలా ఇది బోల్తా పడిన కారు మద్యం మాఫియాకు చెందిన వ్యక్తులదే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన వారిని కూడా గుర్తించి రికవరీ కోసం యత్నిస్తున్నారు.