మెట్రో నగరాల్లో ప్రజా జీవితంలో భాగమైపోయిన మెట్రో రైళ్లు... కరోనా లాక్డౌన్ తర్వాత ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు కేంద్రం శ్రామిక్ రైళ్లకు, దేశీయ విమాన సర్వీసులకు, ప్రైవేట్ చాపర్లకు అనుమతులు ఇవ్వడంతో... ఇక నెక్ట్స్ తమకు కూడా అనుమతులు వస్తాయని దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సంస్థలు భావిస్తున్నాయి. ముందుగా ఢిల్లీ మెట్రో... కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అక్కడ రెండు నెలలుగా ఆగిపోయిన రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. నేటి నుంచే ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. మొత్తం 14000 మంది ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు వచ్చినా... రైళ్లు ఇవాళ కదిలే పరిస్థితి లేదు. బస్సులు, క్యాబ్ సర్వీసులు, ఆటోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... మే 31 తర్వాత తమకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఢిల్లీ మెట్రో నిర్వాహకులు భావిస్తున్నారు.