వారం రోజులుగా సాగుతోన్న దుమారానికి సమాధానంగా నటుడు సిద్ధార్థ్ ఇవాళ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు సారీ చెప్పాడు. తాను కేవలం జోక్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేశానని, అయితే ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సిర్థార్థ్ తన ట్విటర్ ఖాతాలో ఓ లేఖను పోస్ట్ చేశాడు..
''డియర్ సైనా.. కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు స్పందిస్తూ నేను మర్యాద మరిచి చేసిన జోక్‌కు గానూ మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. చాలా విషయాల్లో మిమ్మల్ని నేను విభేదించొచ్చు. కానీ, మీ ట్వీట్ చదివినప్పుడు నిరాశ, కోపంతో చేసిన ఆ కామెంట్లు సమర్థనీయం కావు. మనం జోక్ చేసినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సి వస్తే అది నిజంగా మంచి జోక్ కాదు.
అలాంటి జోక్‌కు నేను క్షమాపణ చెబుతున్నా. అయితే చాలా మంది ఆపాదిస్తున్నట్లుగా నా పదజాలం, హాస్యం వెనుక ఎవరినీ అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. మహిళగా మిమ్మల్ని కించపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇవన్నీ ఇక్కడితో పక్కనబెట్టి నా క్షమాపణ లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరు ఎప్పటికీ మా ఛాంపియనే'' అని సిద్ధార్థ్ లేఖలో రాసుకొచ్చారు.
బ్యాడ్మింటన్ లో బ్యాట్ ను రాకెట్ అని, షటిల్ ను కాక్ అనీ పిలుస్తారని తెలిసిందే. అయితే కాక్(cock), డిక్ అనే పదాలు ఇంగ్లీష్ లో కొన్నిసార్లు పురుషాంగానికి ప్రత్యామ్నాయంగానూ వాడతారు. సైనాపై సెటైర్ వేస్తూ కాక్ ఛాంపియన్.. దేశ రక్షకురాలు అని సిద్ధార్థ్ ఎద్దేవా చేశాడు. ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఉదంతంపై చర్చలో సిద్దూ-సైనాల మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది.
సిద్ధార్థ్ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)తోపాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్వీట్‌పై సైనా స్పందిస్తూ.. ''ఆయన వ్యాఖ్యల అర్థం ఏంటో నాకు తెలియదు. నటుడిగా ఆయన్ని నేను అభిమానిస్తా. కానీ అతడు తన భావాలను మంచి పదాలతో వెల్లడించాల్సింది'' అని ట్విటర్లో పేర్కొన్నారు.