UKలోని శాస్త్రవేత్తల బృందం 'స్టార్‌క్రీట్(StarCrete)'గా పేర్కొంటున్న ఒక కొత్త మెటీరియల్‌ను సృష్టించింది. దీన్ని భూ-అంతర్లీన ధూళి(ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ డస్ట్), బంగాళాదుంప పిండి, ఉప్పుతో తయారు చేశారు. ఈ మెటీరియల్‌ను ఉపయోగించి మార్స్ ఉపరితలం(Martian surface)పై ఇళ్లను నిర్మించుకోవచ్చని రిసెర్చర్స్ చెబుతున్నారు. (PC : IANS)
* ప్రత్యేకతలు : అంతరిక్షంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం ప్రస్తుతం చాలా ఖరీదైన, కష్టతరమైన పని. అయితే ఈ సమస్యకు స్టార్‌క్రీట్ చెక్ పెడుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం చెబుతోంది. బంగాళాదుంప పిండి, చిటికెడు ఉప్పు, మార్స్‌పై లభించే మట్టిని కలిపి, సాధారణ కాంక్రీటు కంటే రెండు రెట్లు బలంగా ఉండే పదార్థాన్ని సృష్టించారు. ఈ మెటీరియల్‌తో భూమికి వెలుపల ఉన్న వాతావరణంలో నిర్మాణాలు చేపట్టవచ్చు.
* రెండింతల బలం : ఈ పరిశోధనకు సంబంధించిన ఆర్టికల్ ఓపెన్ ఇంజినీరింగ్ జర్నల్‌లో ప్రచురితమైంది. కాంక్రీటు లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి సిములేటెడ్ మార్స్ డస్ట్‌తో బంగాళాదుంప పిండిని కలిపినప్పుడు అది బైండర్‌గా పని చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు సార్ట్క్రీట్కి 72 మెగాపాస్కల్స్ (MPa) కంప్రెస్సివ్ స్ట్రెన్త్ ఉంది. ఇది సాధారణ కాంక్రీటులో కనిపించే 32 MPa కంటే రెండు రెట్లు ఎక్కువ. మూన్ డస్ట్‌తో తయారు చేసిన స్టార్‌క్రీట్ 91 MPa కంటే బలంగా ఉంది.
తొలుత ఈ బృందం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించింది. ఫలితంగా వచ్చే పదార్థం దాదాపు 40 MPa కంప్రెస్సివ్ స్ట్రెన్త్తో ఉంది. ఇది సాధారణ కాంక్రీటు కంటే మెరుగైంది. ఈ ప్రక్రియలో క్రమంగా రక్తం వినియోగించలేకపోయారు. ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు, ఈ ఆప్షన్ బంగాళాదుంప పిండిని ఉపయోగించడం కంటే మంచిదని భావించారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ మరింత మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉంది.
* కొనసాగుతున్న పరిశోధనలు : వ్యోమగాములకు ఆహారంగా స్టార్చ్‌ను ఉత్పత్తి చేస్తామని వర్సిటీ ఫ్యూచర్ బయోమ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ హబ్‌కు చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ అలెడ్ రాబర్ట్స్ చెప్పారు. దానిని మానవ రక్తం కంటే బైండింగ్ ఏజెంట్‌గా చూడటంలో అర్థముందన్నారు. ప్రస్తుత నిర్మాణ టెక్నాలజీలు ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, గణనీయమైన శక్తి, అదనపు భారీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్లు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ మిషన్‌కు ఖర్చు, సంక్లిష్టతను జోడిస్తాయని చెప్పారు. స్టార్క్రీట్కి ఇవేమీ అవసరం లేదు కాబట్టి ఇది మిషన్‌ను సులభతరం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాబర్ట్స్ కొత్తగా ప్రారంభించిన స్టార్ట్-అప్ డీకిన్బయో స్టార్క్రీట్ను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషిస్తోంది. భూమిపై ఉపయోగిస్తే, స్టార్‌క్రీట్ సంప్రదాయ కాంక్రీటుకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాన్ని అందించగలదు. దీన్ని సాధారణ ఓవెన్ లేదా మైక్రోవేవ్‌లో సాధారణ 'హోమ్ బేకింగ్' ఉష్ణోగ్రతల వద్ద తయారు చేయవచ్చు. కాబట్టి ఉత్పత్తి, ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాల నియంత్రణ కోసం చేస్తున్న ఖర్చులు భారీగా తగ్గుతాయి.