పర్యాటక ప్రేమికులకు హ్యాపీ న్యూస్.. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పాపికొండల టూర్ త్వరలో సిద్ధం కానుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పర్యాటకులకు గుడ్న్యూస్ చెప్పింది. వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి నదికి ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది.
ఐతే కచ్చులూరులో జరిగిన ప్రమాదం వల్ల ఏడాదిన్నరపాటు పాపికొండల యాత్ర నిలిచిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాపికొండలు యాత్రను పునఃప్రారంభించింది. ప్రత్యేక ప్యాకేజీల ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తోంది. పాపికొండల యాత్రలో గోదావరి నది అందాలతో పాటు పట్టిసీమ, పోలవరం, గండిపోచమ్మ ఆలయం, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం వంటి పర్యాటక ప్రాంతాలు దర్శనమిస్తాయి.
వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేందుకు అధికారులు ఏప్రిల్ 15న ట్రయల్ రన్ నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో దానికి బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది పర్యాటక శాఖ. కచ్చులూరు బోటు ప్రమాదం తరువాత ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినట్లు తెలిపారు. ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఇకపై బోటు ప్రయాణాలను పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
జులై నుంచి బోటు ప్రయాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రేమికులు ఇలా టూర్ ను ప్లాన్ చేసుకోవచ్చు. పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలున్నాయి. ఈ టూర్ ను ముందుగా ఆన్ లైన్లో www.papikondalu.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 7.30 గంటల సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన పురోషోత్తపట్నం, పట్టిసీమ, పోలవరం తీరానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి బోట్ల ద్వారా దేవీపట్నం, పేరంటాళ్లపల్లి, పాపికొండలు, భద్రాచలం వంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. రెండు రోజుల టూర్ కు ఎంపిక చేసిన చోట నైట్ స్టే కల్పిస్తారు. టూర్ పూర్తైన తర్వాత మళ్లీ రాజమండ్రిలోనే డ్రాప్ చేస్తారు.