అభివృద్ది పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రికి ఆలయ రింగ్ రోడ్ చుట్టూ పర్యటించి పలు నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని పూజారులు, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ క్యూలైన్ ను, ఆలయ లైటింగ్ ను పరిశీలించారు. ఆలయం బయట, లోపల నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.
రింగ్ రోడ్ పరిధిలో ఉన్న భూములపై డీజీపీఎస్ సర్వే అత్యవసరంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. రింగ్ రోడ్ పరిధిలోపల కేవలం ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని సీఎం పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం పనికిరాదని ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న ఇతర నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, లాండ్ స్కేపింగ్, బీటీ రోడ్, పుష్కరిణి, కల్యాణ కట్ట, కార్ పార్కింగ్ ఇతర నిర్మాణాల పనులు జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు. ఈ పనులన్నీ ఎప్పటి వరకు పూర్తవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఆలయం పైకి తాగునీటిని సరఫరా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా తరలివస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్ డిపో, బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి విడుదల చేస్తామని, వారం రోజుల్లోగా వాటి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు.