నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు డీజిల్ సెస్ పేరిట చార్జీలను మరో 10 నుంచి 15 శాతం వరకు సవరించాలని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై నిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రయాణికులపై మరింత అదనపు భారం పడే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
గత కొన్నేళ్లుగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఈ సంస్థ ఎంతో నష్టపోయింది. వాటిని పూడ్చుకునేందుకు మార్చిలో రౌండప్ చార్జీలు, టోల్ సెస్, ప్యాసింజర్ సెస్ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచారు. కానీ అంతలోనే డీజిల్ ధరల మోత మోగడంతో.. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్టీసీకి చమురు సంస్థలు బల్క్ సరఫరా నిలిపివేయడంతో.. ప్రైవేట్ బంక్ల నుంచి ఎక్కువ ధర చెల్లించి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీపై రూ.35-40 లక్షల వరకు అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65 నుంచి 73 శాతానికి పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెరగడంలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ క్రమంలోనే టికెట్ చార్జీలను కనీసం 30-35 శాతం మేరకు పెంచడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో డీజిల్ సెస్ పేరుతోనైనా కొంత నష్టాలను పూడ్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)