తెలంగాణ (Telangana) ప్రజలకు మరో షాక్ తగలనుంది. టీఎస్ ఆర్టీసీ (TSRTC) ప్రయాణీకులపై మళ్లీ భారం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ అంటూ ఓసారి, డీజిల్ సెస్ పేరుతో రెండుసార్లు, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ తో దాదాపు 35 శాతం వరకు చార్జీలు పెంచింది టీఎస్ఆర్టీసీ. అయినప్పటికీ నష్టం వస్తుందని ఈసారి టికెట్ ధరలను (Ticket rates) పెంచేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ.
ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు. మినిమం చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్ టికెట్ ధరలు మరింత పెరుగనున్నాయి.