గ్రేటర్ హైదరాబాద్ లో గొప్ప నేతగా కీర్తిగణించిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి మంగళవారం సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ నుంచి నాంపల్లిలోని గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చిన విజయారెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.
గాంధీ భవన్ ప్రాంగణంలో వందలమంది అనుచరులతో కలిసి విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్, కోమటిరెడ్డిలు ఆమెకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు విజయారెడ్డి. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు విజయారెడ్డి. షీ టీమ్‌లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని విజయారెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానని, పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. ఇక మూడు రంగుల జెండాను ఎప్పటికీ వదలనని, ఇకపై తనదిక ఒకటే జెండా.. ఒకటే బాటని విజయారెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ విజయారెడ్డి.. కార్పోరేటర్ గా గెలిచాక మేయర్ పదవి కోసం విఫలయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆమెకు ఖైరతాబాద్ టికెట్ దక్కుతుందనే ఆశల్లేక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారనే వాదన ఉంది. అయితే తాను పదవుల కోసం రాలేదని, ఖైరతాబాద్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని విజయారెడ్డి చెప్పారు.
దాసోజు శ్రవణ్ ను పూర్తిగా సైడ్ చేస్తూ ఖైరతాబాద్ స్థానంలో విజయారెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కుటుంబానికి ఒకే టికెట్ అని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న దరిమిలా అక్కాతమ్ముళ్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తినెలకొంది. ఈలోపు విజయారెడ్డి పోటీ చేసే స్థానంపై ఎంపీ కోమటిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్న విజయారెడ్డి ఆ స్థానంలో పోటీకే తొలి నుంచీ మొగ్గుచూపుతున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కకుంటే కార్పొరేటర్ గానైనా గెలిచారు కానీ ఖైరతాబాద్ ను మాతం వీడలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఆ సీటులోనే అవకాశం దక్కుతుందా? లేదా? అనే చర్చకు తావిచ్చాయి కోమటిరెడ్డి కామెంట్లు.
విజయారెడ్డి చేరిక సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లంతా పీజేఆర్ భిక్షతోనే ఎదిగారని గుర్తుచేశారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడిని పీజేఆరే దగ్గరుంచి నిర్మించారని, అలాంటి పవిత్రమైన చోటుకు పక్కనే కారులో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగడం, ఆ కేసును కేసీఆర్ సర్కారు నీరుగార్చడాన్ని చూసి పీజేఆర్ ఆత్మ క్షోభించి ఉంటుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేదాకా పోరాడుదామని శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు.