ఉద్యోగులు, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే ముందు వాళ్లు చేసింది తప్పా ..ఒప్పా అనే ఆలోచన కూడా చేయడం లేదు. వాళ్లు చేసింది మంచి పనే అయినప్పటికి ప్రభుత్వం వేలెత్తి చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మెదక్ పట్టణంలోని దశాబ్ధాల క్రితం నిర్మించిన గర్ల్స్ హైస్కూల్‌ను ఓ రాజకీయ నేత కుమారుడు దత్తత తీసుకొని ఆధునీకరించారు. దీనికి పరోక్షంగా బాధ్యులు మీరేనంటూ స్కూల్ ప్రాధానోపాధ్యాయురాలు, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి.
స్కూల్ ఆధునీకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం..స్కూల్‌ని దత్తత తీసుకొని 40లక్షలతో రినోవేషన్ చేస్తే ..ఎవర్ని అడిగి చేశారంటూ స్కూల్ హెడ్ మాస్టార్, ఎంఈవోలను నిలదీసింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోకుండా స్వచ్చంద సంస్థతో స్కూల్ ఆధునీకరణ పనులు ఎలా చేయిస్తారంటూ హెడ్ మాస్టార్ రేఖతో పాటు మండల విద్యాశాఖాధికారి నీలకంఠంకు డీఈవో రాధా కిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసారు.
పూర్తిగా దెబ్బతిన్న స్కూల్‌ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ దత్తత తీసుకున్నారు.మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కొత్తగా తీర్చిదిద్దారు. విద్యార్ధులకు నూతన టాయిలెట్లు, మినరల్ వాటర్ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్, ఏర్పాటు చేశారు. స్కూల్ ప్రాంగణంలో గ్రీనరీ డెవలప్ చేశారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌గా తీర్చిదిద్దారు.
ఇదే విషయంపై స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉందనే అక్కసుతోనే ఈ విషయాన్ని జిల్లా అధికారుల దాకా తీసుకెళ్లి రాద్ధాంతం చేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే స్కూల్ ఆధునీకరణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది గతంలో పని చేసిన డీఈవో అనే విషయాన్ని సైతం మర్చిపోయి హెడ్మాస్టార్, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు రాదు..చేసిన వాళ్లను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయితే డీఈవో మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే నోటీసు జారీ చేశామని స్వచ్చంద సంస్థలతో పని చేయించేటప్పుడు తప్పని సరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని మరోసారి తమ చర్యలను సమర్ధించుకుంటున్నారు.
పాలమూరు జిల్లా కోయిల్‌కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 2014లో పూర్తిగా పాడుబడిపోయింది. చిన్న ఇల్లుగా ఉన్న పీహెచ్‌సీని తెలంగాణ ఏర్పడిన తర్వాత 2023లో 100పడకల ఆసుపత్రిగా అన్నీ సౌకర్యాలతో నూతనంగా నిర్మించామని ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. వైద్యాలయాని ఇచ్చిన ప్రాధాన్యత విద్యాలయాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాల భవనాలు శిథిలమైపోతే ఆ చెడ్డ పేరు ప్రభుత్వానికి రాదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.