అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ కవాతు పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుందని కరీంనగర్ లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియం అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు టీపీసీసీ చీఫ్.
కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని బహిరంగ సభ వేదిక ప్రశ్నించారు రేవంత్రెడ్డి. ? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు ఏం చేశారని నిలదీశారు. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్ ఆయన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలన్నారు. పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. జైపాల్ రెడ్డి చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. కేసీఆర్పై కోపంతో బీజేపీ వైపు చూస్తే... పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనన్నారు. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు టీపీసీసీ చీఫ్. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలన్నారు.
బడుగు బలహీన వర్గాలు ముందుకు తీసుకెళ్లేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారని.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే ఉన్నాయన్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని హమీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. పేద రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ..ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు.