బీజేపీకి తొత్తులుగా ఉండాల్సిన అవసరం టీఆర్ఎస్ కు లేదని, నిజానికి బీజేపీ విషయంలో రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు ఆయన పార్టీ నేతలకే వర్తిస్తాయని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకున్న గాడ్సే లాంటి వ్యక్తి(రేవంత్ రెడ్డి)కి గాంధీ భవన్ అప్పగించారని ధ్వజమెత్తారు. అభం శుభం తెలియని అమాయకుడైన అజ్ఞాని రాహుల్ గాంధీ.. ఇక్కడికొచ్చి ఎవరో రాసిస్తే స్క్రిప్టు చదవిపోయే టూరిస్టు వ్యక్తి అని కేటీఆర్ మండిపడ్డారు.
బీజేపీగానీ, మరో పార్టీకి గానీ బీటీమ్ లేదా సీ టీమ్ కావాల్సిన దౌర్భాగ్యం టీఆర్ఎస్ కు పట్టలేదని, తాము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్ అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్ అని, ఎ టు జడ్ అన్ని కుంభకోణాలూ వారికి అలవాటని, ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే.. పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
తెలంగాణకు సీఎంగా కాకుండా రాజులా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న రాహుల్ గాంధీ విమర్శలు అర్థరహితమని కేటీఆర్ అన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని పక్కను కూర్చొబెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నిజంగా రాజులా వ్యవహరించి ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలు మాట్లాడుతూ బయటే తిరిగేవాడా? అని ప్రశ్నించారు.
నిజానికి కాంగ్రెస్ లో రాహుల్ గాంధీని యువరాజు అని పిలుస్తారని, ముత్తాత మోతీ లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్ లాలా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ.. రాజరికం వ్యవస్థ మీదేగానీ కేసీఆర్‌ది కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత అయ్యేదుంటే కాంగ్రెస్ కార్యక్రమాలకు చోటు ఉండేదేనా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ చెప్పిందల్లా నమ్మడానికి, పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది టెన్ జన్‌పథ్ కాదు.. ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపథం అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల్లాగా అవగాహన లేని వారు ఇక్కడ ఎవరూ లేరని, కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.
అసలు రాహుల్ గాంధీ ఏ పదవిలో వరంగల్‌కు వచ్చారో ప్రజలకు తెలియట్లేదని, మమ్మీ గారు అధ్యక్షురాలు.. మరి ఈయన డమ్మీ గారు ఏంటో మాకు తెల్వదు. ఈ డమ్మీ గారు ఎంపీనా, అధ్యక్షుడా మాకు తెల్వదు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో.. ఎప్పుడు బయట ఉంటడో మాకు తెల్వదు. ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ అల్లం బెల్లం చేస్తదని డైలాగ్‌లు కొట్టారో కూడా తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.