నాందేడ్ టౌన్తో పాటు సభ జరిగే వెళ్లే దారులన్నీ గులాబీ రంగు జెండాలు, ఫ్లెక్సీలు, కేసీఆర్ బ్యానర్లతో పాటు స్వాగత తోరణాలతో కిలోమీటర్ల మేర దారి పొడవున ఏర్పాటు చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అదే స్పూర్తితో బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. వీధుల్లో కలియ తిరుగుతూ వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
మరోవైపు నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది.
సభకు హాజరయ్యే చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.