తెలంగాణ రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీనికి మరింత ఊతం ఇచ్చేలా ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చాలని భావిస్తున్నారు. అలాగే కాత ఎలా ఉంది?, దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది?, ఇలా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పర్యవేక్షించేందుకు వీలుగా సాగు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు కంపెనీలతోనూ చర్చించినట్లు తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
డ్రోన్లను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. పదో తరగతి పాసై ఉండాలి. డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. రైతుకైనా, రైతు కుటుంబంలో సభ్యులు ఎవరికైనా ఇస్తారు. నిరుద్యోగ యువతీ యువకులు కస్టమ్ హైరింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే వారికి ఇస్తారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే డ్రోన్లకు ఎంతమేరకు సబ్సిడీ ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
డ్రోన్లకు సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు 8 గంటల్లోపు మద్యం తీసుకోకూడదు. డ్రోన్ ఉపయోగించడానికి తగిన మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవాలి. మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఆ సిగ్నల్స్ డ్రోన్లకు అడ్డుపడవచ్చు. కాబట్టి మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. (ప్రతీకాత్మక చిత్రం)
నీటివనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించాలి. డ్రోన్లతో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. డ్రోన్ ఉపయోగించే ప్రాంతం నుంచి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో పురుగుమందులను పిచికారీ చేయకూడదు. ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలు లేదా అనుమతి లేని జోన్ల మీదుగా డ్రోన్లను ఎగుర వేయకూడదు. అనుమతి లేని ప్రైవేట్ ఆస్తులపై కూడా డ్రోన్ ఎగరకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా అధికారులు వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక డ్రోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా మండలానికి ఒకటి చొప్పున ఇస్తారు. డిమాండ్‌ను బట్టి క్రమంగా వీటి సంఖ్యను పెంచుతారు. తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్ల (యంత్ర పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం)లోనూ అందుబాటులో ఉంచుతారు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)