Tiger Attack: తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో... గత ఆరేళ్లుగా భారీ ఎత్తున మొక్కలు నాటించి... చెట్లుగా అభివృద్ధి చేసింది. చాలా అడవుల విస్తీర్ణం పెరిగేలా చేసింది. మరోసారి హరితహారానికి రెడీ అవుతోంది. అంతా బాగున్నా... ఓ సమస్య ఏర్పడుతోంది. అడవులైతే పెరుగుతున్నాయి గానీ... వాటిలో ప్రాణి కోటి చాలా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా పులులు, చిరుత పులులు తినే ఆహారం అడవుల్లో లభించట్లేదు. అందుకే అవి చుట్టుపక్కల ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా... కుమురం భీం జిల్లాలో అదే జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెంచికల్ పేట మండలం... గుండెపల్లి గ్రామం. టైమ్ తెల్లవారు జాము 3 గంటలైంది. అంతా నిద్రపోతున్న సమయం. అంతలో అడవికి దగ్గర్లోనే ఉన్న పోశయ్య ఇంటి దగ్గర ఏదో అలికిడి. కానీ పోశయ్య కుటుంబం నిద్రలో ఉంది. అంతలో... ఒక్కసారిగా ఎద్దు గట్టిగా అరిచింది. ఇదివరకు ఎప్పుడూ అంత గట్టిగా అరవలేదు. దాంతో... పోశయ్య ఉలిక్కిపడి లేచాడు. తను విన్న అరుపు నిజమేనా లేక నిద్రలో కలగన్నానా అనుకుంటున్న సమయంలో మళ్లీ పెద్ద అరుపు వినిపించడంతో... భయం మొదలైంది. వెంటనే టార్చిలైటు పట్టి... ఇంటి తలుపు తీశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
అంతా చీకటి... టార్చిలైటులో కాంతి తక్కువగా ఉంది. దాన్ని అటు ఇటూ కొడుతూ.... కాంతి పెంచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో... ఒక్కసారిగా సైడ్ నుంచి పెద్ద పులి మీదకు ఉరుకుతూ వస్తుంటే... సరైన సమయంలో చూసిన పోశయ్య... హడలిపోతూ... గట్టిగా అరుస్తూ... ఎద్దు కంటే గట్టిగా కేకలు వేశాడు. చేతిలో టార్చిలైటు, చేతులూ, కాళ్లూ వణికిపోయాయి. ఆయన అరుపులకు కాస్త కంగారుపడిన పులి... అటు నుంచి అటే పారిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4 నెలలుగా ఏ-2 అని పిలిచే ఓ పెద్దపులి తెలంగాణలో 34 పశువుల్ని చంపింది. ఇద్దరు మనుషుల్ని కూడా చంపింది. నెల కిందటి వరకూ బెజ్జూర్ మండలం కందిభీమన్న అడవిలో తిరిగింది. దాన్ని బంధించేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక బృందాలు జనవరి 11 నుంచి 18 వరకు ట్రై చేశాయి. అది చూసిన పెద్దపులి... ప్రాణహిత నది దాటి మరీ మహారాష్ట్రకు వెళ్లింది. దాంతో ఇక అది పోయిందిలే అనుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
జనవరి 24 నుంచి మరో పులి టెన్షన్ మొదలైంది. మాటి మాటికీ ఊళ్లలోకి వస్తూ పశువులపై దాడిచేస్తోంది. దాంతో స్థానికులు అది మహారాష్ట్ర వెళ్లలేదనీ... ఇక్కడే తిరుగుతోందని అంటున్నారు. ఆ పులి భయంతో... పెంచికల్పేట్, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని 35 గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లట్లేదు. అటు అటవీ అధికారులు దాన్ని పట్టుకోవట్లేదు. ఎప్పుడు ఏమవుతుందో అనే టెన్షన్ స్థానికుల్లో పెరిగిపోతోంది. ఆవులు, గేదెలు చనిపోతుంటే... వారు మరిన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)