తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. బహిరంగ సభలతో తమ బలాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని భావిస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. తన పాత నియోజకవర్గం కొడంగల్ నుంచి ఈ సారి పోటీ చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న రేవంత్ ఇటీవల తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సోదరుడు కొడంగల్ లోనే ఉంటూ స్థానిక నాయకులతో టచ్ లో ఉంటున్నారు.
మరో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ సారి ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నారు. తన పాత నియోజకవర్గం నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అయితే.. ఆయన ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నుంచి కూడా కోమటిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.