సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. గజ్వేల్ కేంద్రంగా గూడ్స్ రైలు రాకపోకలు మొదలయ్యాయి. గజ్వేల్ లో కొత్తగా ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్ రేక్ పాయింట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం FCI గోడౌన్ నుంచి 21 బోగీల్లో 13 టన్నుల ఎరువులతో వచ్చిన తొలి గూడ్స్ రైలుకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.
గజ్వేల్ రైల్వే స్టేషన్ లో ఈ సందర్భంగా ప్రత్యేకంగా డెకరేషన్ చేశారు. జిల్లా మనోహరాబాద్ నుంచి జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 151 కి.మీ. పొడవైన ఈ రైల్వే లైన్ పనులు తెలంగాణ వచ్చాకే ఊపందుకున్నాయి. 8 ఏళ్లలో మొత్తానికి మొట్టమొదటి గూడ్స్ రైలు గజ్వేల్ వరకు వచ్చేసింది. రూ.1160.47కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పనులు 4 దశల్లో కొనసాగుతున్నాయి.
మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు పూర్తయిన దాదాపు 43 కిలోమీటర్ల రైల్వే లైన్ ను అనేక పరీక్షల తర్వాత సేఫ్ అని రైల్వే అధికారులు తేల్చారు. దీంతో.. రైల్ చుక్ చుక్ మని దూసుకొచ్చేసింది. సనత్ నగర్, చర్లపల్లి నుంచి ఈ కొత్త లైన్ ను లింక్ చేయనున్నారు. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఎరువుల రేక్ పాయింట్ ఉంది. దీంతోపాటు.. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో ఉన్న అన్ని రేక్ పాయింట్లు, పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లను కూడా ఈ రైల్వే లైన్ తో లింక్ చేస్తారు.
ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హరీశ్ రావు ఎరువుల రేక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటం అన్నారు. "కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ సాధన కోసం ఒత్తిడి పెంచారు. రైల్వే లైన్ కేంద్రం బాధ్యత. కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య నిధులు ఇచ్చేవారు కాదు. తెలంగాణ వచ్చాక మూడో వంతు నిధులు ఎప్పటికప్పుడు ఇచ్చాం. కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశాం" అన్నారు హరీశ్ రావు. కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించుకు పోయి తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఫైరయ్యారు.
గజ్వేల్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభం తర్వాత బీహార్ కార్మికులతో మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన సంభాషణ జరిపారు. "మీరు ఎక్కడి నుంచి వచ్చారని హరీశ్ రావు అడిగితే. బీహార్ నుండి వచ్చాం సర్ అన్నారు కూలీలు. "నెలకు ఎంత వరకు సంపాదిస్తున్నారని అడిగితే.. రూ.30-40 వేల వరకు వస్తున్నాయనీ.. 10 వేలు ఖర్చు పెట్టుకొని 20-30 వేలు ఇంటికి పంపిస్తామన్నారు. "బీహార్ నుండి ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు?" అని అడిగితే.. అక్కడ పని దొరకడం లేదు. అందుకే పొట్ట చేత పట్టుకొని వచ్చాం.. ఇక్కడ చేతినిండా పని ఉంది.. అని చెప్పారు కూలీలు. "ఇక్కడ ఏదైనా సమస్య ఉందా. మంచిగా చూసుకుంటున్నారా" అని మంత్రి అడిగితే.. బాగుంది సర్.. తెలంగాణను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని కూలీలు చెప్పారు. బీహార్ లో తాగునీటి వ్యవస్థ ఎలా ఉందీ అనేది వారిని అడిగి తెల్సుకున్నారు. ఇలా వాళ్లు అంత దూరం నుంచి రావడం.. ఇంతగా సంపాదించడం.. కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా ఉండటం అంశాలను పదే పదే ఆసక్తిగా తెలుసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ వారిని ఉత్సాహ పరిచారు హరీశ్ రావు.