దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తెలంగాణలోనూ నిత్యం 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులను పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కరోనా ఆంక్షలను విధించింది సర్కార్. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రేపు అంటే సోమవారం మధ్యాహ్నం కేబినేట్ అత్యవసరంగా సమావేశం కానుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అంశంపై సైతం చర్చించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రివర్గానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించనున్నారు. నివేదికపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే లాక్ డౌన్ పై విధించే అవకాశాలపై సైతం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా నైట్ కర్ఫూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా.. తాజాగా 1900 కేసులు నమోదయ్యాయి. అయితే సంక్రాంతి వేడుకల నేపథ్యంలో కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
జీహెచ్ఎంసీ పరిధిలోనూ కేసుల నమోదు స్వల్పంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. మొన్న జీహెచ్ఎంసీ పరిధిలో 1233 కేసులు నమోదు కాగా.. నిన్న ఆ సంఖ్య 1075గా నమోదైంది. ఇంకా జీహెచ్ఎంసీ పరిసర జిల్లాలైన రంగారెడ్డి జిల్లాలైన రంగారెడ్డిలో 168, మేడ్చల్ జిల్లాలో 150, సంగారెడ్డి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)