నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఉన్నతాధికారులకు సూచించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్టీసీ పరిస్థితిపై రివ్యూ చేపట్టిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే సమగ్ర నివేదికతో రావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని నిన్న జరిగిన సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైన సమయంలోనే కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.