తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ యాసంగిలో, వచ్చే వానాకాలానికి సంబంధించి కేంద్రం ఏంత మేరకు తెలంగాణ బియ్యాన్ని కొంటుందనే క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయనకు కేంద్ర పెద్దలెవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అక్కడ ఎవరినీ కలవకుండానే బుధవారం సాయత్రం హైదరాబాద్ తిరిగొచ్చారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బస చేసిన సీఎం కేసీఆర్.. మూడు రోజులపాటు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు. కానీ పీఎం వివిధ పనులతో బిజీగా ఉండటంతో ఇంటర్వ్యూ దక్కలేదు. కనీసం రాబోయే రోజుల్లోనైనా టైమిస్తారా లేదా అనే స్పష్టత లేకపోవడంతో చేసేది లేక సీఎం కేసీఆర్ తిరిగొచ్చేశారు. అయితే ఆయన వెంట వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉంది.
తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా కొనబోమని కేంద్ర స్పస్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో మంత్రుల, అధికారుల బృందం మంగళవారం నాడు కేంద్ర ఆహార మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్లను కలవగా ఈ మేరకు వారు స్పష్టతనిచ్చారు. ఉప్పుడు బియ్యం ఇక చరిత్రేనని, ఇకపై ఎప్పుడూ తెలంగాణ నుంచి ఆ బియ్యాన్ని కేంద్రం కొనబోదని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు
తెలంగాణలో పండే సాధారణ బియ్యంపైనా కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. పండే పంటలో ఎంత మేరకు కొంటాని తెలంగాన మంత్రులు పదే పదే అడిగినా కేంద్రం సమాధానం చెప్పలేదు. అయితే, ఏదో ఒక జవాబు చెప్పేదాకా ఢిల్లీలోనే ఉంటామని తెలంగాణ బృందం భీష్మించడంతో ఈనెల 26న మళ్లీ సమావేశం అవుదామని కేంద్ర మంత్రులు చెప్పారు. బియ్యం కొనుగోలుపై అదే రోజు క్లారిటీ ఇస్తామని కేంద్ర మంత్రులు చెప్పడంతో ఆ మీటింగ్ కు సీఎం కేసీఆర్ కూడా వెళతారనే ప్రచారం జరిగింది. కానీ
మూడు రోజులు ఎదురు చూసినా ప్రధాని మోదీతో భేటీ ఖరారు కాకపోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. మంత్రులు, అధికారులు మాత్రం ఈనెల 26నాటి మీటింగ్ ను చూసుకొని హైదరాబాద్ రానున్నారు. కేసీఆర్ ముందు నుంచీ వాదిస్తున్నట్లుగానే బాయిల్డ్ రైస్ కొనుగోనులుకు నో చెప్పిన కేంద్రం.. సాధారణ బియ్యం విషయంలోనూ క్లారిటీ ఇచ్చే అవకాశాలు లేవనే గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం పిలుపునివ్వగా.. కాదు రైతులంతా వరినే పండించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునివ్వడంతో రెండు పార్టీల మధ్య వరి పోరు తారాస్థాయికి చేరింది. అప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయి, ఒకప్పటి కేసీఆర్ సన్నిహితుడు ఈటల రాజేందర్ గెలిచిన నేపథ్యంలో సీఎం సడెన్ గా వరి పోరును ఉధృతం చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
పైకి చూడటానికి ప్రధాని అపాయింట్మెంట్ దక్కకపోవడం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అవమానం లాంటిదే అయినా, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం.. తెలంగాణను ఎంతగా విస్మరింస్తే టీఆర్ఎస్ కు అంతగా లబ్ది చేకూరుతుందని కేసీఆర్ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం క్లారిటీగా లేదని గ్రహించే, ఇక్కడి బీజేపీ నేతలను తుత్తునీయాలు చేసే పథకంలో భాగంగానే ఢిల్లీ పర్యటకు వెళ్లినట్లు వాదనలున్నాయి.
తెలంగాణలో బీజేపీని నిలువరించేలా తన ఢిల్లీ పర్యటన అంశాలను సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని, ధాన్యం కొనుగోలుపై కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడాన్నిబలంగా ప్రచారం చేయబోతున్నారని, అదే సమయంలో ప్రత్యామ్నాయ పంటలపైనా సీఎం నిర్ణయాలు వెలువరిస్తారని అధికార టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఢిల్లీలో అగ్గిరాజేస్తానని, దేశంలో మంట పెడతానని హడావుడిగా హస్తినకు వెళ్లే కేసీఆర్.. ఉసూరుమంటూ వెనక్కి రావడం గతంలోనూ పలుమార్లు జరిగిందని జనం చర్చించుకుంటున్నారు.