నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిబుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన రెండవ రోజు అదే జోరులో కొనసాగింది. మండుటెండను, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని మరీ బైఠాయించి తమ ఆందోళనను ఉధృతం చేశారు. రెండో రోజు విద్యార్ధులు కదలకుండా బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ట్రిబుల్ ఐటి మెయిన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
కళాశాలకు చేరుకొని విద్యార్థుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు వచ్చిన అనేక పార్టీల నాయకుల్ని, విద్యార్ధి సంఘాల నేతల్ని ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైస్ ఛాన్స్లర్ని నియమించాలని డిమాండ్ చేస్తూ తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగిన స్టూడెంట్స్‌తో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫారూఖీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికి విద్యార్ధులు తగ్గేదేలేదు అని తేల్చి చెప్పారు.
బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలోని స్టూడెంట్స్ ధర్నాపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాలేజీ ఇంచార్జి వైస్ చాన్సలర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అన్నీసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సైతం విద్యార్ధుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూస్తామని మాటిచ్చారు.