Tribal shrine | Telangana: కొండ గుహలో అడవి బిడ్డల పండుగ .. అభివృద్దికి నోచుకోని గిరిజనుల పుణ్యస్థలి
Tribal shrine | Telangana: కొండ గుహలో అడవి బిడ్డల పండుగ .. అభివృద్దికి నోచుకోని గిరిజనుల పుణ్యస్థలి
Tribal shrine: అటవీ ప్రాంతంలో ఉన్న జంగుభాయి క్షేత్రంలో పుష్యమాసంలో నెలవంక కనిపించడంతో ఏటా ఉత్సవాలు ప్రారంభమై అమావాస్య వరకు నెలరోజులపాటు కొనసాగుతాయి. ఇక్కడి ఆదివాసీలు జరుపుకునే అతి పెద్ద పండుగ ఇదే. ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది..ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారో తెలుసా.
చుట్టూ అడవులు. ఎత్తైన గుట్టల మధ్య ప్రకృతి సిద్దమైన కొండ గుహలో కొలువున్న ఆదివాసిల ఇష్టదైవం జంగుబాయి క్షేత్రంలో పుష్యమాసం సందర్భంగా ఆదివాసి గిరిజనులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
2/ 16
వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ప్రతియేట పుష్యమాసంలో ఉత్సవాలను జరుపుకుంటూ తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆదివాసీ బిడ్డలు. జంగుబాయికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
3/ 16
నెల రోజులపాటు ఎంతో నిష్టతో ఆదివాసిలు కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివచ్చి తమ ఇష్టదైవమైన జంగుబాయిని ఆరాధిస్తారు. నెల రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కోరి వచ్చిన భక్తులకు వరాలను ఇచ్చే వరప్రదాయినిగా విరాజిల్లుతోంది జంగుబాయి క్షేత్రం.
4/ 16
ఇక్కడకు వచ్చి భక్తి శ్రద్దలతో ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని ఆదివాసీ భక్తుల విశ్వాసం. పంటలు వేసే ముందు, శుభకార్యాలు చేసె ముందు జంగుబాయిని దర్శించుకోవడం సెంటిమెంట్‌గా భావిస్తారు ఇక్కడి అఢవి బిడ్డలు.
5/ 16
పుష్య మాసంలో మాత్రం ఆదివాసి గిరిజనులు తప్పక దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోళి పరిధిలో ఈ ప్రకృతి క్షేత్రం ఉంది.
6/ 16
మహారాజ్‌గూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో పుష్యమాసంలో నెలవంక కనిపించడంతో ఉత్సవాలు ప్రారంభమై అమావాస్య వరకు నెలరోజులపాటు కొనసాగుతాయి. ఇక్కడి ఆదివాసీలు జరుపుకునే అతి పెద్ద పండుగ ఇదే.
7/ 16
ఈ క్షేత్రానికి కాలినడక, ఎడ్లబండ్లపై ఇంకా ఇతర వాహానాలపై ఇక్కడికి తరలివచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల రోజులు గిరిజనులు ఎంతో నిష్టతో ఉంటారు. కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా, కఠిక నేలపై పడుకుంటారు.
8/ 16
మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఆలయ ప్రాంగణంలోనే నైవేద్యాలు తయారు చేస్తారు. సంప్రదాయ తుడుం, కాలికోం వంటి వాయిద్యాలతో గుహలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు.
9/ 16
మైసమ్మ, పోచమ్మ, రావుడ్ దేవతలకు మేకలు, కోళ్లను బలి ఇస్తారు. గారెలు, బూరెలు వంటి ప్రత్యేక పిండివంటలతో నైవేద్యాలను తయారు చేస్తారు. రాత్రి ఇక్కడే బస కూడా చేస్తారు. భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తారు.
10/ 16
అయితే జంగుబాయి క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పకుండా దారి మధ్యలో జంగుబాయి క్షేత్రానికి కొద్దిదూరంలో ఉన్న టొప్లకసకు వెళ్ళి పూజలు చేయడం అనవాయితీ. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోయినప్పటికి ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
11/ 16
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో గిరిజన భక్తులు ఈ జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఏటా పుష్యమాసంలో తరలివస్తారు.
12/ 16
వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి అనే ఎనిమిది గోత్రాలకు చెందిన వారు ఒకే వేదికపై మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
13/ 16
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు గుర్తింపు నిచ్చి ఉత్సవ సమయంలో పది లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేస్తోంది. వీటిని భక్తులకు తాగునీరు, సత్రాలు తదితర అభివృది కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
14/ 16
ఇదిలా ఉంటే ఆదివాసి గిరిజనుల పుణ్యస్థలిగా విరాజిల్లుతున్నా జంగుబాయి క్షేత్రంలో మౌలిక సదుపాయాల లేమి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే భక్తులను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది.
15/ 16
తాగునీటి వసతి లేకపోవడంతో ఎడ్లబండ్లు ఇతర వాహనాలపై సుదూర ప్రాంతాల నుండి తీసుకురావాల్సి పరిస్థితి ఉంది. విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తే బాగుంటుందని ఇక్కడి ఆదివాసి గిరిజన బిడ్డలు కోరుతున్నారు.
16/ 16
ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ గిరిజన బిడ్డల సంప్రదాయాన్ని గౌరవించి తగిన విధంగా భక్తుల సౌకర్యాలు కల్పిస్తే ఈ జంగుబాయి పుణ్యక్షేత్రం మరింత ప్రాచూర్యం పొంది మేడారం సమ్మక్క-సారక్క జాతర తరహాలోనే ప్రసిద్ధి చెందుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.