తెలంగాణలో ప్రవహిస్తున్న పుణ్యనది ప్రాణహిత పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదికి ఎనిమిదవ రోజున భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానాలు చేయడానికి రాష్ట్రంలోని నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుణ్యనదిలో స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రధానాలు చేస్తున్నారు.
పుణ్యనది ప్రాణహిత ప్రవహిస్తున్న ప్రతి చోట ఘాట్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. భక్తులకు తగిన విధంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా ఆర్టీసి వారు ఆయా పుష్కర ఘాట్ల వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికి ఎక్కువ మంది భక్తులు తమ స్వంత వాహనాలు, అద్దె వాహనాల్లో తరలివస్తున్నారు.
అర్జునగుట్ట వద్ద చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు కూడా సహయక కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేసినప్పటికి భక్తుల సంఖ్యకు సరిపడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మందికి సరిపోయే విధంగా పుష్కర ఘాట్లలో ఏర్పాట్లు చేస్తే బాగుంటుందంటున్నారు.
అర్జున గుట్ట వద్ద నదికి అవతలి వైపు మహారాష్ట్రలోని సిరొంచలో కూడా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఈ పుష్కరాల కోసం పది కోట్ల రూపాయల నిధులను కెటాయించగా, అక్కడి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికంటె అక్కడ కొంత సౌకర్యాలు మెరుగుగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా సిరోంచకు వెళ్ళి ప్రాణహిన నదిలో పుష్కరస్నానాలు చేస్తున్నారు. పొరుగున ఉన్న మహరాష్ట్ర పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తే తెలంగాణ ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని భక్తులు విమర్శిస్తున్నారు.