పచ్చని దుప్పటి కప్పుకున్న అడవిలో, పాలవెల్లిలా జాలువారుతున్న జలపాతాన్ని చూస్తుంటే మనసు పులకరిస్తుంది. జలపాతంలో జలకాలాడుతుంటే ఇట్టే సమయం గడిచిపోతుంది. అప్పుడు ఆ అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇటువంటి ప్రకృతి అందాలను చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక జలపాతాలు ఉన్నాయి. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలు వలుకుతు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లా పరిధిలో నాలుగు జలపాతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నా.. అన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో సబ్బిత జలపాతం చేరుకోవడానికి అడవి మార్గం ద్వారా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే జలపాతం వద్ద సందడిగా ఉండడంతో కష్టమైనా సరే పర్యాటకులు స్థానిక యువత ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక జూన్ చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు జలపాతంలో నీరు మరింత పెరిగి ఎంతో ఆకట్టుకుంటుంది.
వారాంతాల్లో పెరుగుతున్న తాకిడి: ఈ జలపాతం వద్ద సరదాగా గడిపేందుకు వారాంతాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శని ఆదివారాల్లో నిత్యం 200 - 300 మంది పర్యాటకులు ఈ సబ్బితం జలపాతానికి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు సదుపాయం లేకపోయినా, పర్యాటకులు ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఇక్కడకు వస్తున్నారు. జిల్లా అధికారులు, పర్యాటకశాఖ సిబ్బంది స్పందించి మంచి సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
సబ్బితం గౌరీ గుండాల జలపాతాలకు దారి: పెద్దపల్లి జిల్లా బస్టాండ్ నుండి మంథని వెళ్ళే రూటులో సుమారు15 కిలో మీటర్ల దూరంలో సబ్బితం అనే గ్రామం ఉంది. అక్కడి నుండి కుడి వైపు నున్న మట్టి రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర వెళ్తే మనకు గౌరీగుడాల జలపాతం కనిపిస్తుంది. అక్కడి స్థానికుల ద్వారా సమీపంలోని మరికొన్ని చిన్న జలపాతాలు కూడా తెలుసుకోవచ్చు.