నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె.వరుణ్ రెడ్డి మరుసటి రోజే జిల్లాలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. అధికారులతో సమీక్షలపై దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారిగా ఉన్న కె. వరుణ్ రెడ్డిని నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియమించారు.
ఇది వరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన ముషార్రఫ్ అలీ ఫారూఖీని బదిలి చేసిన ప్రభుత్వం ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా రెండు రోజుల క్రితం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వరుణ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే ఆకస్మిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గ, కుంటాల మండలం కుల్లూరు, భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా కల్లూరు ఉన్నత పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల గదిని పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో, విద్యార్థుల హాజరు శాతం ఎందుకు తక్కువగా ఉందని ఆరా తీశారు.
కొద్దిసేపు కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు గణితంలోని బేసిక్ ఫార్ములా ఇచ్చి దానికి సంబంధించి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానం చెప్పలేకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ గణిత ఉపాధ్యాయుడిని పిలిచి విద్యార్థులకు కనీసం బేసిక్స్ కూడా రావడం లేదని, తరగతిలో ఏం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ వరుణ్ రెడ్డి కంటివెలుగు శిభిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కంటి పరీక్షలు ఎలా చేస్తున్నారో దగ్గరుండి పరిశీలించారు. ఒక్కొక్క టేబుల్ ను పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో మన ఊరు మన బడి, కంటివెలుగులపై సమీక్షా నిర్వహించారు.