పిల్లల ఆకలి ఒకవైపు.. పొంగిపొర్లుతున్న వాగులు మరో వైపు. అయినా ఇవన్నీ లెక్కచేయని హాస్టల్ వార్డెన్ (Hostel warden)తన ప్రాణాలను ఫణంగా పెట్టి హాస్టల్ సరుకుల కోసం బయలుదేరి వెళ్లాడు. వసతి గృహానికి వంట సామాన్లు తీసుకువెళ్లడం మహా అయితే గంటసేపు ప్రయాణం అనుకుంటున్నారా?. చిన్నారుల ఆకలి తీర్చడం కోసం దట్టమైన అడవి గుండా 80 కిలోమీటర్లు అడ్డదారిలో ప్రయాణం చేశాడు హాస్టల్ వార్డెన్ వంశీ.
హాస్టల్ వార్డెన్ వంశీ పై న్యూస్ 18 ప్రత్యేక కథనం: గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం రవాణా మార్గం లేని గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాంటి ఒక మారుమూల గ్రామమే ఐలాపురం.
కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐలాపురం వద్ద వాగు పోటెత్తింది. బయట ప్రపంచంతో ఆగ్రామానికి రవాణా మార్గాలు నిలిచిపోయాయి. కనీసం ఫోన్ ద్వారా సమాచారం అందించలేని పరిస్థితి నెలకొంది. వాగు పోటెత్తడంతో హాస్టల్ కు రావాల్సిన నిత్యావసరాలు రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే విద్యార్థుల కోసం వార్డెన్ వంశీ ఎంతో రిస్క్ తీసుకున్నాడు.