కరోనా కారణంగా గత విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా గతేడాది ప్రత్యక్ష తరగతులు కొన్ని రోజుల పాటే నిర్వహించారు. ఆన్లైన్లో విద్యాబోధన సాగినా.. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థం కాని పరిస్థితి. సెకండ్ వేవ్ కారణంగా అనేక బోర్డు ఎగ్జామ్స్ సైతం రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ ఏడాది అలా జరకూడదని ప్రభుత్వాలు ప్రత్యక్ష బోధన జరిపేలా నిర్ణయం తీసుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నడిపేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్ వేరియంట్ భయంతో మళ్లీ విద్యాసంస్థలు మూసి వేస్తారంటూ ప్రచారం సోషల్ మీడియా వేధికగా జోరుగా సాగుతోంది.
అయితే.. ఈ ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి స్పందించారు. ఈ ప్రచారం అవాస్తవమని ఆమె ఖండించారు. ఇలాంటి పుకర్లను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులను మంత్రి కోరారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. స్కూళ్లలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉందన్నారు.
పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి, పిల్లల తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో పని చేసే మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లుగా కరోనా కారణంగా నష్టపోయారని మంత్రి గుర్తు చేశారు.