తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుతున్నాయి. దుబ్బాక ఎన్నికలతో మొదలైన రాజకీయ వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మంత్రి హరీశ్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని పథకాలను పోల్చుతూ ధ్వజమెత్తారు.(మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు)
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని ముంగిలో ఏర్పాటు చేసిన రైతు వేదికను మంత్రి హరీశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వృద్ధులకు రూ. 500 పెన్షన్ ఇస్తే తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తోందన్నారు. ఆడ పిల్ల పెళ్లికి కర్ణాటక ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదన్నారు. (మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు)
కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్ష ఇస్తోందన్నారు. కర్ణాటకలో రైతు బీమా లేదని.. కానీ.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షలను అందిస్తోందన్నారు. కర్ణాటకలో ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని.. కానీ తెలంగాణ లో 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు.(మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు)
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పంటలు మద్ధతు ధరకు కొనకపోవటం వల్ల అక్కడి రైతులు ఇక్కడ అమ్ముకుంటున్నారన్నారు. కందులకు కర్ణాటక ప్రభుత్వం క్వింటాకు నాలుగు వేలు ఇస్తే, మేం ఆరు వేలకు కొంటున్నామన్నారు. ఈ తేడాలను గమనించి ఏ ప్రభుత్వం పేదలు, ముఖ్యంగా రైతుల పక్షపాతో చెప్పాలని ప్రజలను మంత్రి హరీశ్ కోరారు.(మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు)