Indian Soldier Mahesh: దేశం నాకేమిచ్చింది అని కాకుండా... దేశానికి నేనేమి ఇచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. వీర జవాన్ ర్యాడ మహేష్ అలాంటి వాడే. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు... చొరబడుతుంటే... శత్రు మూకలకు ఎదురొడ్డి పోరాడాడు. బుల్లెట్లు దూసుకొస్తుంటే... వెనకడుగు వెయ్యకుండా... ముందుకే కదిలాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించి... అమరుడయ్యాడు.
ఇవాళ ఉదయం మహేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాలతో గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర జరిపారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్, జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సమీప గ్రామాల ప్రజలు మహేష్ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ పర్యవేక్షణలో అదనపు డీసీపీ, ఏసీపీ, ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 150 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతిమ యాత్రలో పాల్గొన్న వారంతా అమర్ రహే ర్యాడ మహేష్ అంటూ కీర్తించారు.
వీర జవాన్ మహేష్ (26) చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనే కలతో పెరిగాడు. అతనిది నిజామాబాద్ జిల్లా... వేల్పూర్ మండలంలోని కోమటిపల్లి గ్రామం. 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ గవర్నమెంట్ స్కూల్లో, 7 నుంచి 10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాడు. నిజామాబాద్‌లోని శాంఖరి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆరేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న మహేష్... 2019 డిసెంబర్లో ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని పలకరించి వెళ్లాడు. అదే చివరి పలకరింపు. తాజాగా జరిగిన ఉగ్రదాడిలో మహేష్ అమరజవాన్ అవ్వడం అందర్నీ విషాదంలో ముంచేసింది.
తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయారు. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా... ఆ ఇద్దరిలో ఒకడు మహేష్. జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఇండియాలోకి రాకూడదని గట్టిగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అమరుడయ్యాడు.