మహబూబ్ నగర్ జిల్లాలో మన్యంకొండ ఆర్చీ నుంచి దేవాలయం వైపు రూ. 4.79 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించిన బీటి డబుల్ రోడ్డు, డబుల్ రోడ్డు వెంట రూ. 52 లక్షల వ్యయంతో వేసిన సెంట్రల్ లైటింగ్, దేవాలయం ముఖ ద్వారం వద్ద రూ. 27.65 లక్షలతో నిర్మించిన చెరువు కట్ట అభివృద్ధి పనులు మరియు స్నాన ఘట్టాన్ని, భక్తుల సౌకర్యార్థం రూ.2.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 18 వసతి గృహాల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం దేవాలయం పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడి మీడియాతో మాట్లాడారు. దేవాలయ శాఖలో అత్యుత్తమ గ్రేడ్ ఉన్న మన్యంకొండ దేవాలయాన్ని ఏటా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ స్నానాల కోసం ఘాట్, వసతి గృహాలు నిర్మించామని వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడే రూప్ వే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
వంశపాంపర్యంగా అలహరి కుటుంబం దేవాలయాన్ని కాపాడుతూ వస్తున్నారని మంత్రి తెలిపారు. 10 లక్షల మొక్కలు నాటి దేవాలయ, అటవీ భూములను కాపాడుకుంటామని, ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలకు అద్భుతంగా ఏర్పాటు చేసిన దేవాలయ పాలకమండలి సభ్యులను, అధికారులను మంత్రి అభినందించారు. భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, మన్యం కొండ దేవాలయం ధర్మకర్త మధుసూదన్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ చంద్రకళ, నాయకులు రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, దేవాలయ పాలకమండలి సభ్యులు ఉన్నారు.