తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. రంగారెడ్డి జిల్లాలో స్పల్ప ఉద్రిక్తలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు ప్రశాంతంగా కొనసాగాయి. కాగా మొత్తం 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో నామినేషన్స్ వేయగా.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో వేసింది. ఇక బీజేపీ ఎన్నికల్లో పోటీచేయమని ఇదివరకే ప్రకటించింది.
నిజామాబాద్‌లో ఒక స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్స్ ధాఖలు చేయగా టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. అదే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల సంఘం నుంచి కోటగిరి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. కాగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్స్ సమర్పించారు.అభ్యర్థులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి,మర్రి జనార్థన్ రెడ్డిలు వెళ్లారు. అంతకు ముందు పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేయడంతో అభ్యర్థులకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు.
అనూహ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణానికి చెందిన దండె విఠల్ ను అధినేత అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఈ విఠల్ ఎవరన్న ప్రశ్నలు అందరిని తొలిచివేశాయి. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన దండె విఠల్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, 2000లో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఉంటూ ఐటి, హెల్త్ కేర్, క్రాఫ్ట్ పేపర్ , లాజిస్టిక్స్ వ్యాపారాలలో రాణిస్తున్నారు.