Leopard: తెలంగాణలో ఈ మధ్య వన్య ప్రాణుల సంచారం బాగా పెరిగింది. ఎక్కడో అడవుల్లో తిరిగితే ఏ సమస్యా ఉండదు. కానీ అవి అడవులు వదిలి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో చిరుతపులుల సంచారం బాగా పెరిగింది. ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ చిరుత పులి తిరుగుతున్నట్లు తెలిసింది. (కుడివైపు చిరుతపులి - File Photo)
మల్కాపూర్ గ్రామ శివారులోని FCI ఫిల్టర్ బెడ్ దగ్గర్లో చిరుత పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ చిరుతపులి... ఏ గడ్డిలోనో నడుస్తూ వెళ్లి ఉంటే... ఏ ముద్రలూ దొరికేవి కావు. అదృష్టం కొద్దీ ఆ చిరుత పులి... ఇసుక లాంటి నేలపై నడుస్తూ వెళ్లింది. అందువల్ల దాని పాద ముద్రలు ఆ ఇసుకలో దిగాయి. అవి ఇప్పుడు అధికారులకు కనిపించడంతో అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దనీ... తెల్లారక ముందే ఇల్లలోంచీ బయటకు రావొద్దనీ, సాయంత్రం వేళ చీకటి పడకముందే ఇళ్లలోకి వెళ్లిపోవాలని తెలిపారు.
ఈ విషయం తెలియడంతో మల్కాపూర్ గ్రామ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఆ చిరుత పులి ఇప్పుడు ఎక్కడుందో, అది ఏ ఇంటివైపు వస్తుందో అని భయపడుతున్నారు. అధికారులేమో... దాన్ని త్వరలోనే పట్టుకుంటామనీ... టెన్షన్ పడవద్దని చెబుతున్నారు. జనరల్‌గా చిరుతపులులు... మనుషులు వెళ్లే రోడ్లపై వెళ్లవు. అలా వెళ్తే... తమ రాకను వారు గుర్తిస్తారని వాటికి భయం. కానీ ఈ చిరుత కొద్దిగి చిన్నది కావచ్చేమో.. అందువల్ల అది రాత్రివేళ అలా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మల్కాపూర్ చుట్టుపక్కల చిరుత కోసం వేట మొదలైంది. అది దొరికేలోపు ఎవరిపైనా దాడి చెయ్యకుండా ఉంటే మంచిదే. పులి కంటే చిరుతపులిని పట్టుకోవడం కష్టం. పులి పెద్దగా పరుగు పెట్టదు. చిరుతపులి... సన్నగా... కరెంటు తీగలా ఉంటూ... ఈజీగా పరుగులు పెడుతుంది. పైగా చెట్లు ఎక్కి మరీ పారిపోగలదు. అందువల్ల దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలని అధికారులు ప్లాన్ వేస్తున్నారు.