భాగ్యనగరవాసులకు శుభవార్త. ఒత్తిడిని తగ్గించి.. ఆరోగ్యాన్నిచ్చే ఆక్యుప్రెజర్ పార్క్ హైదరాబాద్ లోనూ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ దానిని ప్రారంభించారు. ఇందిరా పార్కులో నిర్మించిన.. పంచతత్వ పార్కు ను కేటీఆర్ ప్రారంభించారు. నగర ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ ఈ పార్కును అభివృద్ధి చేసింది.
ఎకరం విస్తీర్ణంలో సర్కిల్ పద్దతిలో ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ‘‘నగరంలో గ్రీన్ జోన్‌ను పెంపొందిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా ఇందిరా పార్కులో రూ. 16లక్షలతో పంచతత్వ పార్కును ఏర్పాటు చేశాం. అందులో 50రకాల ఔషధ మొక్కలను నాటాం. కంకర, చెక్కపొట్టు, ఇసుక, గులకరాళ్లతో ప్రత్యేకంగా ట్రాక్ నిర్మాణం చేశాం. నడుస్తున్నప్పుడు పాదాల అడుగుభాగంలో ఉన్న నరాలపై ఒత్తిడి పడి, రక్త ప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి’’ అని పేర్కొన్నారు.