యూట్యూబ్ స్టార్ , బిగ్బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది . సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక నెరవేరింది . జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . కాగా ' మై విలేజ్ షో'తో య్యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే .
పల్లెటూరి యాస , కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ కొత్తిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్ బాస్ హౌస్ అడుగు పెట్టింది . అయితే అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది . అయినప్పటికీ ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు .
నాగార్జున నుంచి చెక్కుతోపాటు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా వచ్చిందని ఈ ఏడాది ఆరంభంలో గంగవ్వ చెప్పింది. ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . తన సొంతింటి కల నెరవేరినందుకు.. దీనికి తనకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతీ ఒక్కరికీ గంగవ్వ ధన్యవాదాలు తెలుపుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమానికి బిగ్బాస్ ఫేమ్ అఖిల్ , శివజ్యోతి , చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు . గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్లో నిలిచింది . గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.