వరుసగా రెండో ఏడాది కూడా అధిక వర్షపాతం నమోదు కావడం, అక్టోబర్ మూడో వారంలోనూ వానలు దంచికొడుతోన్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధానంగా కృష్ణా నదిలో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో, అదే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా నీటిని కిందికి వదులుతున్నారు.. వివరాలివి..
కర్ణాటక, మహారాష్ట్రల్లోని నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండటంతో మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,05,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతున్నది. దీంతో అధికారులు మొత్తం 16 గేట్లు ఎత్తేసి స్పిల్ వే ద్వారా 65,094 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,471 క్యూసెక్కులు, సాగునీటి కాలువలకు కలిపి మొత్తం 1,05,646 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం (9.657 టీఎంసీ) కంటే తక్కువలో (5.888 టీఎంసీ) నిల్వ ఉంచి వచ్చిన వరద వచ్చినట్లుగా శ్రీశైలం దిశగా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 మీ. గాను ప్రస్తుతం 317.970 మీ. గా ఉంది. ఇక..
జూరాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, ఇప్పటికే నిండుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం వద్ద ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,83,403 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,88,974 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ దిశగా నీటిని వదులుతున్నారు. కింద..
శ్రీశైలం నుంచి వరద వస్తున్నక్రమంలో నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ జలాశయం గేట్లు ఎత్తేశారు. ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,72,113 క్యూసెక్కులుగా ఉండగా, సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.7 అడుగులు. గరిష్ట నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 311.14 టీఎంసీలుగా ఉంది.
సాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 1,70160 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2 క్రస్ట్ గేట్లను రెండు మీటర్లు, మూడు క్రస్ట్ గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి 1,63,644, టేల్‌రేస్ ఛానల్ ద్వారా 6516 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువనున్న సాగర్ నుంచి 1,60,00 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తోంది. రిజర్వాయర్‌లో 6.744 టీఎంసీల నీరుండగా ఇది 75.11 మీటర్లకు సమానం. చివరిగా..
పైనుంచి వరద ఉధృతి కొనసాగుతోన్నక్రమంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని కిందికి వదుతులున్నారు. సోమవారం సాయంత్రానికి 81,500 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చిందని, తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 15,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 20 గేట్లను రెండు అడుగులు, 50 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 66వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.