జగిత్యాల పోలీసులు దోపిడీ ముఠాను 48 గంటల్లోనే ట్రేస్ చేయడం గమనార్హం. పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరీ రాబరీ గ్యాంగ్ తో పాటు చోరీకి గురైన కొంత సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన 48 గంటల్లోగా దొంగల ముఠాను కస్టడీలోకి తీసుకోవడంపై జగిత్యాల జిల్లా పోలీసులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
బీదర్ ప్రాంతానికి చెందిన ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల అడ్డాలను గుర్తించి వాటిపై నిఘా వేసి సోదాలు జరిపారు. నాలుగు పోలీసు టీమ్స్ కో ఆర్డినేషన్ చేసుకుంటూ బీదర్ పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి గురైన నిందితుల వద్ద వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొండగట్టు దోపిడీ దొంగల ముఠా సభ్యులందరు సెల్ ఫోన్స్ వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు తమను వెంటాడుతున్నారన్న విషయం గమనించిన పోలీసులు దొంగలు మొబైల్స్ స్విచ్ఛాప్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే వారిని పట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పోలీసు బృందాలకు మొత్తం ముగ్గురు పట్టుబడగా వారిని హుటాహుటిన జగిత్యాలకు తరలించినట్టు సమాచారం.
సీసీ ఫుటేజీలో రికార్డయిన వారిలో ఒకరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అంజన్న ఆలయంలోకి చొరబడి వెళ్లిన ముగ్గురిలో మరో ఇద్దరి కోసం వేట కొనసాగించిన పోలీసులు మరో దఫా కర్ణాటక వెళ్లేందుకు నిర్ణయించుకుని తిరుగు ప్రయాణం అయినట్టు సమాచారం. నిందితుల నుంచి సుమారు 8 కిలోల వరకు వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.