అయితే మొదటి నుంచీ బిజినెస్ చేయాలనే లక్ష్యంతో ఉన్న సాయికేశ్ కొద్ది రోజులకే ఉద్యోగానికి స్వస్తి పలికాడు. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడటం కళ్లారా చూశాడు. అందుకే ఉద్యోగం చేయడం కాదు, వందలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు. అంతే మదిలోని ఆలోచన బయటకు తీశాడు. మిత్రులు సమి, అభిషేక్ తో తన ఐడియాలను పంచుకున్నాడు.
ఇప్పటికే కంట్రి చికెన్ సెంటర్స్ ద్వారా 70 మందికి ఉద్యోగాలు కల్పించారు ఈ ముగ్గురు మిత్రులు.ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో తమ నాటుకోడి మాంసం వ్యాపారం విస్తరించాలని సాయికేశ్ నిర్ణయించుకున్నారు. దక్షిణాదిలోని 15 వేల మంది రైతులతో కలసి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. రైతులు పెంచిన నాటు కోళ్లను కూడా మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
నాటు కోళ్లకు బలమైన ఆహారం అందించేలా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. తద్వారా నాణ్యమైన, రుచికరమైన నాటుకోడి మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. ఓ వైపు మార్కెట్లో వారికి కావాల్సిన నాటుకోళ్లను వారే స్వయంగా పెంచడంతోపాటు, రైతు స్థాయిలో కూడా నాటుకోళ్లు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకుగాను బెస్ట్ ఎమర్జింగ్ మీట్ బ్రాండ్ అవార్డ్ చేజిక్కించుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం నాటుకోడి ఫేమస్. దక్షిణాదిలో ముఖ్యంగా 5 రకాల నాటుకోళ్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో స్థానిక జాతి కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో స్థానిక నాటు కోడి మాంసం ఎక్కువ సేల్స్ ఉంది. రైతులు పెంచేది కూడా అదే రకం. ఆర్గానిక్ పద్దతిలో పెంచడంతో మంచి రుచి కూడా చూకూరుతోంది.
నాటు కోళ్లు పెంచేందుకు కనీసం 6 నెలల సమయం తీసుకుంటుంది. 6 నెలల్లో తక్కువ పెట్టుబడితో ఆర్గానిక్ గా పెంచుతున్నట్టు సాయికేశ్ తెలిపారు. ఫీడ్ కాస్ట్ తగ్గించుకునేందుకు హైడ్రోఫోనిక్స్ లో ఫుడ్ పెంచుతున్నారు. రైతుల వద్ద నాటు కోళ్లు కొనుగోలు చేసేందుకు ముందే అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నట్టు సాయికేశ్ వెల్లడించారు.