Airbus Beluga : ఇది చూశారా ఎంత పెద్దగా ఉందో. ఇది ప్రయాణికుల విమానం కాదు. కార్గో ఫ్లైట్. ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా సరుకులు రవాణా చేయాలంటే ఏకైక మార్గం కార్గో విమానాలు. సముద్ర మార్గాలు, భూ మార్గాల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకులు, మందులు చేరవేయాలంటే వారాల సమయం పడుతుంది. అత్యవసర, విలువైన వస్తువుల్ని గంటల్లో చేరవేసే మార్గం విమానమార్గం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా.. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.
ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల బెలూగా ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. బెలూగా కార్గో విమానం 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు. విమానం బరువు 86 టన్నులపైనే. ఒకేసారి 47 టన్నుల బరువైన సరుకులు తరలించగలదు. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్ ఈ కార్గో విమానాన్ని తయారుచేసింది. అప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తూ, సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది.