Vande Bharat Train:ఏపీ, తెలంగాణ ప్రజలకు మోదీ సంక్రాంతి గిఫ్ట్.. సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ ట్రైన్ ప్రారంభం అయ్యింది. సంక్రాంతి పండుగరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది వందేభారత్ ఎక్స్‌ప్రెస్.తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేసింది.
ఆది, సోమవారాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు తీసింది. ఆదివారం ఉదయం.. ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.
అయితే వందేభారత్ రైలు తొలి రోజు 15 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నంలో సోమవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 2.30గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది. స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్‌ఫారంపైకి చేరుకున్న రైలును చూసేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వందే భారత్ ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాలి. కానీ ఈ రైలు తొలిరోజే ఆలస్యంగా నడిచింది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ద్వారా 699 కిలోమీటర్ల దూరం 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రైలులో 16 కోచ్‌లు ఉండగా, ఐదుగురు టికెట్ కలెక్టర్లు (టీసీలు), 14 మంది ఆర్పీఎఫ్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సెకండ్ క్లాస్ ఏసీకన్నా ఈ రైలులో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సంక్రాంతి కావడంతో సీట్లన్నీ నిండిపోయాయి. సోమవారం సాయంత్రానికే ఈనెల 17, 18, 19 తేదీలకు సీసీ, ఈసీ సీట్లన్నీ భర్తీ అయి, వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది.
అయితే ఈ ట్రైన్ టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూట్లో ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.3,120, సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు రూ.1005, సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.1460, సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూట్లో రూ.1775, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వరకు రూ.2,485 చొప్పున ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక ఈ వందే భారత్ రైలులోని సీట్లు 180-డిగ్రీలు తిరుగుతాయి. 32-అంగుళాల స్క్రీన్, రెస్ట్రూమ్లు, సీట్ హ్యాండిల్స్‌పై బ్రెయిలీ లిపిలో సీట్ నెంబర్స్... ఇలా అనేక ఫీచర్స్ ఉన్నాయి. సెఫ్టీ విషయానికి వస్తే నాలుగు ప్లాట్‌ఫారమ్ సైడ్ కెమెరాలు, జీపీఎస్, ఆటోమేటిక్ డోర్లు, ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. (image: Indian Railways)