ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ
ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో కైంకర్యాలను పూర్తి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు నిత్య సుప్రభాత సేవతో వేడుకను ప్రారంభిస్తున్నారు. తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం.
తోమాలసేవ, కొలువు:
ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు వరకు తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను, ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్నే తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని ”తోమాల” అంటారు. తొడుత్తమాలై అనే తమిళ పదంతో వచ్చిన మాట ‘తోళ్‌మాల’. ఈ సేవ సుమారు 30 నిమిషాలసేపు జరుగుతుంది.
అర్చన : ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు
భగవత్శక్తి దినదినాభివృద్ది కావడానికి చేసే ప్రధాన ప్రక్రియ ఆగమశాస్త్రోక్త ‘అర్చన’. ఈ అర్చనలో ఆవాహనాదిగా అనేక ఉపచారములు చోటు చేసుకుంటాయి. అనేక మంగళకరములైన ఓషధి ద్రవ్యములతోనూ, అనేక పుష్పములతోనూ, తులసి మొదలగు పత్రములతోనూ ఈ అర్చన జరుపబడుతుంది. ధ్రువాది పంచమూర్తులకు, పరిషద్దేవతాగణాలకు, లోకపాల-అనపాయిను లకు ఈ అర్చన జరుపబడుతుంది.
నివేదన, శాత్తుమొర : ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు
నిత్యం అర్చన తరువాత గర్భాలయంలో శ్రీస్వామివారికి, ఇతర మూర్తులకు నివేదన జరుగుతుంది. లడ్డూలు, వడలు, దధ్యోదనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను నివేదిస్తారు. తొలి నివేదనను మొదటి గంట, మధ్యాహ్నం నివేదనను రెండవ గంట, రాత్రి నివేదనను మూడవ గంట లేదా రాత్రి గంట అంటారు.
శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం సేవలకు అపూర్వ స్పందన
హైదరాబాద్ లో జరిగిన ఈ శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శ్రీవారి నమూనా ఆలయంలో మొదటి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనసేవ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు వేడుకగా జరిగింది. అష్టదళాలతో కూడిన108 బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదళ పాదపద్మారాధన. ఇందులో భాగంగా బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు.
వసంతోత్సవం – వైభవంగా స్నపనతిరుమంజనం
ఉదయం 10 నుండి 11 గంటల వరకు వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కలశారాధన నిర్వహించారు. అనంతరం అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం పలు అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో దాతలు శ్రీ హర్షవర్ధన్, శ్రీ ఎస్ఎస్.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, ఏఇఓలు శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.