నర్సగోని ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురి దగ్గర కార్లను అద్దెకు లేదా ఎంగేజ్ పేరుతో తీసుకున్నాడు. ప్రతినెల సదరు వాహనాలకు సరిపడా డబ్బులు ఇస్తానంటూ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ప్రవీణ్ గౌడ్ స్వగ్రామం శంకర్పల్లి అయితే మకాం హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పెట్టాడని బాధితులంటున్నారు.
గోల్డెన్ ట్రావెల్స్ క్యాటరర్స్ పేరుతో సంస్థ నడుపుతున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం షాద్ నగర్, మొగిలిగిద్ద తదితర గ్రామాలకు చెందిన సాయి కుమార్ గౌడ్, ఏక్ నాథ్, కళ్యాణ్, మహేందర్, అశోక్, నర్సింహులు అనే కొందరి దగ్గర షిఫ్ట్ డిజైర్, ఎర్టిగాతో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన కార్లను ఎంగేజ్ నిమిత్తం తీసుకున్నాడు.
గత 3 నెలలుగా అందరికీ నెలసరి డబ్బులు ఇవ్వడం మానేశాడు. దీంతో బాధితులు ఎందుకు అని అతనిపై ఆరా మొదలుపెట్టారు. చివరకు తమ వాహనాలు కూడా తమ కంటపడకుండా చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సాయికుమార్ గౌడ్‌తో పాటు మిగిలిన 14మంది తమ వాహనాల కోసం పట్టుబట్టారు. కార్లు తీసుకున్న ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తమ వాహనాలపై ఆరా తీశారు.
గోల్డెన్ ట్రావెల్స్ సూత్రధారి నర్సగొని ప్రవీణ్ గౌడ్‌కి అప్పగించిన 14 వాహనాలు కంటికి కనిపించకుండా పోయాయి. అతను మాత్రం ఓ అతిథిలాగా వచ్చి వెళ్తున్నట్టు బాధితులు షాద్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే 12 లక్షల అద్దె బకాయలు ఇవ్వాల్సి ఉందని నర్సగొని ప్రవీణ్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాలు ఎలాగైనా ఇప్పించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.