హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు కొందరు అసాంఘీకశక్తులు. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ విష సంస్కృతిని విస్తరింపజేస్తున్నారు. కొన్ని దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసి ఆన్లైన్లో కస్టమర్స్‌ను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలతో లోకల్ ముఠాలు చేతులు కలిపి మహిళలను తరలిస్తున్నాయి.
ఈ హైటెక్ వ్యభిచారానికి ఫామ్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుంటున్నారు. అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు జరుపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సంబంధిత ఫామ్‌హౌస్‌లపై నజర్ లేకపోవడంతో శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ వీకెండ్ పార్టీల పేరిట పెద్ద ఎత్తున వ్యభిచారం చేస్తున్నారు. గుంపులుగా యువతీ యువకులు ఫామ్‌హౌస్‌లను బుక్ చేసి వీకెండ్ శనివారం, ఆదివారం రెండు రోజులు మజా చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్, నందిగామ, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఫామ్‌హౌస్‌లు ఇందుకోసమే అన్నట్లుగా దందా నడుస్తోంది. హైదరాబాద్ నుండి ఇక్కడికి వీకెండ్ పార్టీల కోసం వస్తున్నారు. పార్టీ జల్సాల ముసుగులో అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయని పోలీసులు చెబుతున్న మాట. అసలు ఫామ్ హౌస్ లను అద్దెకు ఇచ్చి అందులో లిక్కర్ అనుమతి ఎలా ఇస్తారని? మరో వాదన కూడా వినిపిస్తుంది.
వీకెండ్ వచ్చిందంటే చాలు బాగా డబ్బున్న పిల్లలు, లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు గెట్ టు గెదర్ , వీకెండ్ పార్టీల పేరుతో ఆన్లైన్లో ఫామ్‌హౌస్ బుక్ చేసుకొని అందులోనే అమ్మాయిలతో కలిసి తాగి తందనాలు ఆడుతున్నారు. అక్కడైతే ఎలాంటి తనిఖీలు ఉండవు.. స్విమ్మింగ్ పూల్, అందమైన తోటలు, ప్రకృతి వనాలు, విశాలమైన గదులు లాంటి ఫెసిలిటీస్ ఉంటాయనే సెలక్ట్ చేసుకుంటున్నారు.
ఆన్లైన్లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి విటులకు వల వేస్తున్నారు. యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికంటే అక్కడికి పంపించి ఎస్కార్ట్ సర్వీసులు అందిస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. అమ్మాయి అందం, ఆకర్షణ బట్టి, పంపాల్సిన ప్రాంతాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆన్లైన్లో బేరసారాలు అయ్యాక యువతులను పంపిస్తున్నారు.
షాద్ నగర్ నియోజక వర్గంలో కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధి పెద్దమ్మతండా రోడ్డులో ఓ బిజేపి యువ నాయకుడు, సర్పంచ్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఏహెచ్‌టీయూ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రంగంలోకి దిగి ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. బాధిత యువతిని రక్షించి, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.